Dec 18, 2008

ఫ్లాష్ బ్యాక్

1989 ...

అక్టోబర్ 4

అర్ధరాత్రి చలికాలం

ఊరంతా నిద్రలోకి జారుకున్నా హైదరాబాద్ చలి వణికిస్తున్నా కూడా

పట్టుమని పాతికేళ్ళు కూడా లేని ఆ కుర్రవాడికిమాత్రం ఆ రోజు శివరాత్రే అయింది.

టెన్షన్ తో నిద్ర పట్టడం లేదు... నుదిటి మీద చెమట...

పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుర్రవాడి కంటే వెయ్యి రెట్ల టెన్షన్ ని అతను అనుభవిస్తున్నాడు.

అవును...

తెల్లవారితే అతను దర్శకత్వం వహించిన మొదటి సినిమా రిలీజ్...

55 రోజుల్లో షూటింగు ...

75 లక్షల రూపాయల ఖర్చు ... (ఇప్పటి లెక్క ప్రకారం 8 కోట్ల రూపాయల పైనే !)

ఏ సన్నివేశాన్ని ఎలా తీశాడో అర్థం కాని పరిస్థితి యూనిట్ వాళ్ళది...

రీరికార్డింగ్ చూసి నీరసపడిపోయిన నిర్మాతలు...

ఆ మరునాడు... అనగా అక్టోబర్ 5 న ఆ సినిమా విడుదలైంది...

ఆంధ్ర ప్రదేశ్ అంతటా అల్లకల్లోలం...

పెద్ద సంచలనం...జనం విరగబడి చూశారు .

కాలేజీ కుర్రాళ్ళంతా సైకిలుచైనులు పట్టుకొని తిరగడం మొదలు పెట్టారు.

22 కేంద్రాల్లో 100 రోజులు...

5 కేంద్రాల్లో 155 రోజులు...

తమిళంలోకి అనువదిస్తే అక్కడా ఘన విజయం...

కొత్త దర్శకుల్లో స్ఫూర్తిని నింపిన సినిమా...

తెలుగు సినిమా చరిత్ర ని ఈ సినిమా కంటే ముందు,

ఈ సినిమా తర్వాత అని వర్గీకరించేంతగా ప్రభావం చూపిన ఆ సినిమా...

'శివ'

ఆ దర్శకుడు...

రామ్ గోపాల్ వర్మ...


ఎన్టీయార్ తర్వాత తెలుగోడి సత్తాను దేశానికి చాటుతున్న బాలీవుడ్ మేటి దర్శకుడు..

తెలుగు సినిమాలకు స్క్రిప్టుల కొరత


పరిశ్రమలో స్క్రిప్టు రైటర్ల కొరత చాలా వుంది.
దీనికి పరాకాష్ఠ 'శంకర్ దాదా జిందాబాద్ '.
'లగేరహో మున్నా భాయ్' రీమేక్ హక్కులకి 11 కోట్లకుపైగా వెచ్చించి,'చిరు ' పారితోషికంగా 7 కోట్ల వరకూ, సినిమా తీయడానికి మరో 12 కోట్లు అంటే మొత్తం 30 కోట్లు పెట్టుబడి పెడితే ప్రేక్షకుల నుండి వసూలు చేసిన మొత్తం 20 కోట్లు కూడా దాటలేదు.

Dec 16, 2008

నా 'సినిమా' ప్రేరణ

Dec 6, 2008

స్టడీమెటీరియల్ (FILM/T.V.)

నా బ్లాగులు చదివేవారందిరికీ ఒక శుభవార్త.
ఇక నుండి మన సైటులో సినిమా/టీ.వీ. రంగ విశేషాలు,విశ్లేషణలు మరియు పరిశోధనకు సంబంధించిన అంశాలతో పాటు"నటన"(acting),"దర్శకత్వం" (direction) మరియు "స్క్రిప్టు రైటింగ్" (script writing) కు సంబంధించిన పూర్తి "స్టడీ మెటీరియల్" దశల వారీగా అందించబడుతుంది.
ఎలైట్ ఫిల్మ్ అకాడమీ (Elite Film Academy),చెన్నయ్ మరియు తెలుగుతెర.నెట్ (www.telugutera.net), హైదరాబాదు వారు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ "స్టడీ మెటీరియల్" ఇతర భాషల లోకి అనువదించినా,రీప్రింట్ చేసినా,కాపీ కొట్టినా లేదా సీ.డీ./డీవీడీ కన్వర్షన్ చేసినా నాచే జరుపబోవు సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు బాధ్యులు కాగలరనిహెచ్చరిస్తున్నాను.

Dec 4, 2008

మనకొక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కావాలి




భారత దేశంలో అత్యధిక థియేటర్లు కల్గిన రాష్ట్రంగా మరియు అత్యధిక సినిమాలు నిర్మించే రాష్ట్రంగా పేరొందిన మనకు తమిళనాడు తరహా లో స్వంత ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లేకపోవడం శొచనీయం.

భారత చలనచిత్ర పరిశ్రమకు మేలైన నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను అందించే ఉద్ధేశ్యంతో 1960 లో ప్రభుత్వ సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పూణేలో Film and Television institute of India ను ఏర్పాటు చేయడం జరిగింది.

దీని ప్రభావంతో తమిళనాడులోనూ,పశ్చిమ బెంగాల్ లోనూ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లు ఏర్పాటు

చేయబడి,ఎంతో మంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు వెలుగులోకి రావడం జరిగింది.

ముఖ్యంగామద్రాసు ఫిల్మ్ ఇని స్టిట్యూట్ నుండి శిక్షణ పొందినవారిలో హీరోలు చిరంజీవి,రాజేంద్రప్రసాద్ వంటి హేమాహేమీల నుండి నేటి మేటి దర్శకుడు"బొమ్మరిల్లు" భాస్కర్ వరకూ ఉండడం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ల యొక్క ఆవశ్యకతను చెప్పకనే చెప్తుంది.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుండి హైదరాబాదుకు తరలి వచ్చి దశాబ్ధం పైబడి కావొస్తున్నా ఫిల్మ్ ఇని స్టిట్యూట్ ఏర్పటు దిశగా ఏ ప్రభుత్వమూ చొరవ చూపలేదు.

ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొని,విజయ శిఖరాల్ని అధిరోహించిన నటీనటులు గానీ,సాంకేతిక నిపుణులు గానీ తమ వారసుల్ని ప్రమోట్ చేసుకొంటున్నారే తప్ప ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పటు దిశగా ఎటువంటి ప్రయత్నం గానీ, ప్రభుత్వం పై ఒత్తిడీ గానీ తీసుకురావడం జరగలేదు.

ఐతే దేవదాస్ కనకాల గారి ఆధ్వర్యంలో నడుస్తున్న Film and Television Institute of Andhra Pradesh , మధుసూధనరావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న Madhu Film Institute లు "నటన" విభాగంలో కొంతవరకు ఆ లోటును తీర్చగలుగుతున్నాయి.

ఇక దర్శకత్వం నేర్పే ఇనిస్టిట్యూట్ లు అస్స లే లేవు.

ఎంతో కాలంగా ఎదురు చూసిన "Ramanaidu Film School" 25 మంది విద్యార్థులతో ("దర్శకత్వం" కోర్సు) ప్రారంభమైనా సంవత్సరానికి రెండు లక్షల రూపాయల ఫీజు అనేసరికి సామన్యుల ఆశల పై నీళ్లు చల్లినట్లయింది.

పోనీ స్వంతంగా ఏవైనా కోర్సులు నేర్చుకుందామనుకున్నా పుస్తకాలు దొరికే అవకాశం లేదు.ఒకవేళ దొరికినా కొన్ని వేల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి.

కొన్ని సంస్థలు (ఎలైట్ ఫిల్మ్ అకాడమి, రే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లాంటివి) నటన,దర్శకత్వం మరియు స్క్రిప్టు రైటింగ్ లాంటి విభాగాలకు సంబంధించిన మెటీరియల్ ను అందిస్తున్నా,ప్రాక్టికల్ శిక్షణ కోసం స్వంతం గా ఏ టెలీఫిల్మో లేదా డాక్యుమెంటరీయో తీయడమో లేదా ఇంకొకరి దగ్గర అసొసియేట్ గానో చేయాల్సి వస్తుంది.ఐతే అనుభవం కోసం ఇంకొకరి దగ్గర సంవత్సరాల కొద్దీ అసిస్టెంట్ గా చేస్తే, "సృజనాత్మకత" దెబ్బ తినే ప్రమాదముంది.

"హ్యాపీడేస్" లాంటి చిత్రాల నేపథ్యంలో యువతరం చిత్రసీమను శాసిస్తూ వుండగా,ఇరవైఅయిదుకి పైగా ఛానళ్లతో రాజ్యమేలుతున్న తెలుగు టీ.వీ.రంగానికి కొన్ని వందలమంది సుశిక్షితులైన నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల అవసరం ఏర్పడింది.

"మాస్ కమ్యూనికేషన్" (Mass Communication) విద్యార్థులతో టీ.వీ.రంగానికి మానవ వనరుల కొరత కొంతవరకు తీరుతున్నా, నిర్మాణాత్మక మైన,సుశిక్షితమైన శిక్షణ నిచ్చేఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ అవసరం తప్పకుండా వుంది.